Homeక్రైంMedak | యూట్యూబ్‌లో చూసి చోరీలకు యత్నం.. ముగ్గురు మిత్రులను అరెస్ట్​ చేసిన పోలీసులు

Medak | యూట్యూబ్‌లో చూసి చోరీలకు యత్నం.. ముగ్గురు మిత్రులను అరెస్ట్​ చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, మెదక్​ : Medak | పలువురు యువకులు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నారు. దీనికోసం నేరాలు చేయడానికి వెనకాడటం లేదు. బెట్టింగ్​లు, చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా యూట్యూబ్ (Youtube)​ చూసి చోరీలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

మెదక్ (Medak)​ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన శ్రీకాంత్(24), లింగం(28), ప్రసాద్(20) స్నేహితులు. వీరు సులువుగా డబ్బు సంపాదించడానికి (Easy Money) బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలు చేయాలని ప్లాన్​ వేశారు. ఈ మేరకు దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్​లో చూశారు. అయితే పలు బ్యాంకుల్లో చోరీలకు యత్నించి విఫలం అయ్యారు. మెదక్​ జిల్లా గుమ్మడిదలలో హెచ్​డీఎఫ్​సీ (HDFC) ఏటీఎంను ట్రాక్టర్​కు కట్టి లాక్కెళ్లాని చూశారు. అయితే సైరన్​ మోగడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయారు. వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్‌లో ఎస్​బీఐ ఏటీఎంలో సైతం చోరీకి యత్నించారు. అక్కడ కూడా సైరన్​ మోగడంతో పారిపోయారు.

Medak | మద్యం దుకాణాల్లో చోరీ

బ్యాంకుల్లో చోరీకి యత్నించి విఫలమైన వీరు వైన్​ షాపుల్లో మాత్రం దొంగతనం చేశారు. గత నెలలో గుమ్మడిదలలోని భవాని వైన్​షాపులో చోరీ చేశారు. ఈ నెల 7న కౌడిపల్లిలోని మద్యం దుకాణంలో చోరీ చేశారు. ఖరీదైన మద్యం బాటిళ్లు, నగదు ఎత్తుకెళ్లారు. అంతేగాకుండా ఆ పలు మద్యం బాటిళ్లను బయట విక్రయించారు. మరికొన్ని సీసాలను తాగడానికి దాచుకున్నారు.

Medak | సీసీ ఫుటేజీ ఆధారంగా..

బ్యాంకుల్లో దొంగతనానికి యత్నించిన వీరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ మేరకు మానేపల్లి శివారులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు మెదక్​ ఎస్పీ శ్రీనివాసరావు (SP Srinivasa Rao) తెలిపారు. వారి నుంచి మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించామన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కావొద్దని ఆయన సూచించారు.

Must Read
Related News