అక్షరటుడే, వెబ్‌డెస్క్: Polala Amavasya | ఏటా శ్రావణ మాసం(Shravana masam)లో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్య(Polala Amavasya) అంటారు. దీనిని ఎడ్ల పొలాల అమావాస్యగానూ పేర్కొంటారు. హిందూ మతంలో దీనికి ప్రత్యేకత ఉంది.
పూర్వీకులను స్మరించుకుంటూ, తమ సంతానం యోగ క్షేమాలను కాంక్షిస్తూ మహిళలు ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. పొలాల అమావాస్య వ్రతం ఆచరించేవారికి సంతానానికి సంబంధించి ఉన్న దోషాలు తొలగిపోతాయని, అమ్మవారు సంతానాన్ని ప్రసాదించడమే కాకుండా అపమృత్యు భయాలను తొలగించి, ఆయురారోగ్యాలను కూడా ప్రసాదిస్తారని భక్తులు నమ్ముతారు. శనివారం(Saturday – August 23rd) పొలాల అమావాస్య నేపథ్యంలో ఈ పండుగ విశిష్టత తెలుసుకుందామా..
Polala Amavasya | పొలాల అమావాస్య ప్రాముఖ్యత..
ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. పూర్వం ఓ బ్రాహ్మణ మహిళకు (Brahmin woman) ఏటా పిల్లలు పుట్టినా కొన్ని గంటలలోనే ఏదో ఒక కారణంతో మరణించేవారు. దీంతో ఆమె ఏడుస్తూ ఊరవతల ఉన్న పోచమ్మ ఆలయం (Pochamma Temple) వద్దకు మృత శిశువులను తీసుకువెళ్లి ఖననం చేసేది. అయితే ఏటా శ్రావణ మాసంలోని అమావాస్య రోజునే పిల్లలు పుట్టేవారు. దీంతో ఆమె ఇంట్లో పొలాల అమావాస్య నోము నోచుకోవడానికి ఎవరిని పేరంటానికి పిలిచినా భయంతో వచ్చేవారు కాదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా పిల్లలు పుట్టి మరణిస్తున్నారని ఆ బ్రాహ్మణ మహిళ బాధపడేది. ఒక రోజు పోచమ్మ ఆమెకు కనిపించి ఇలా చెప్పింది. ‘గత జన్మలో నీవు పొలాల అమావాస్య వ్రతం ఆచరించావు.
అయితే ముత్తైదువులకు వాయినాలు ఇవ్వకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం (Payasam), గారెలు పెట్టావు. ఆహారంలో రుచి సరిపోయిందో లేదోనని చూశావు. ఆచారాన్ని అమంగళం చేసినందుకు ఈ జన్మలో బాధను అనుభవిస్తున్నావు’ అని పేర్కొంది. ‘పొలాల అమావాస్యం రోజున గోమాత పేడతో అలికి పసుపు, కుంకుమతో (turmeric and saffron) రాసి, కందమొక్కను రాసి, కందమొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి నువ్వు కట్టించుకోవాలి. పిండి వంటలను అమ్మవారికి నివేదించాలి. భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. శక్తి మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల కలరా, మలేరియా, మశూచి తదితర వ్యాధులు సోకవు. పిల్లలు మరణించరు’ అని చెప్పింది. పోచమ్మ తల్లి చెప్పిన ప్రకారం ఆ బ్రాహ్మణ స్త్రీ వ్రతం ఆచరించి ఫలితాన్ని పొందింది.
Polala Amavasya | పూజా విధానం..
తెల్లవారుజామునే నిద్రలేచి.. ఇంటిని శుభ్రం చేసి.. పూజా గదిలో కందమొక్కను ఉంచాలి. ఆ మొక్కకు తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని గానీ, సంతాన లక్ష్మీదేవిని గానీ ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజలు చేయాలి. పిండి వంటలను నైవేధ్యంగా సమర్పించాలి. చుట్టు పక్కల ఇళ్ల నుంచి కూరగాయలను అడిగి తీసుకుని, వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువలకు వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.