అక్షరటుడే, ఇందూరు: Nizamabad District | పేకాట రాయుళ్లు పోలీసులకు చిక్కకుండా రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. సినిమా తరహాలో వాహనాలు మారుస్తూ అటవీ ప్రాంతాల్లోను జూదం అడ్డాలుగా మార్చుకుంటున్నారు. అంతేకాదు పోలీసులు రైడ్ (police raid) చేస్తే నగదు పట్టుబడకుండా నయా ట్రెండ్‌కు తెర లేపారు. కాసినో కాయిన్స్ తరహా పోకర్ చిప్స్‌తో గేమ్ ఆడుతున్నారు. ఇలా జిల్లాలో పేకాట దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది.
జిల్లాలోని వర్ని మండల అటవీ ప్రాంతంలో (forest area) గత కొన్ని రోజులుగా జోరుగా జూదం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వర్ని నుంచి బాన్సువాడ (Varni to Banswada) వెళ్లేదారిలో ఓ స్థావరాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. బోధన్ (Bodhan), నిజామాబాద్ (Nizamabad), బాన్సువాడ (Banswada) తదితర ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు, ప్రముఖులు, రియల్టర్లు, లీడర్లు రూ. లక్షల్లో పేకాడుతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కాసినో కాయిన్స్ మాదిరిగా ముద్రించిన పోకర్ చిప్స్‌ను రూపాయల మాదిరిగా జూదంలో వాడుతున్నారు.
Nizamabad District | సినిమాల్లో మాదిరిగా వాహనాల మార్పు..
ఇక పేకాట స్థావరాలు సైతం పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరి కంటా చిక్కకుండా కొందరు నిర్వాహకులు దట్టమైన అటవీ ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేసి జూదం ఆడిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అటవీ ప్రాంతానికి వెళ్లాలంటే సాహసమే చేయాల్సి ఉంటుందట. పేకాట ఆడాలనుకునేవారు వర్నికి చేరుకుంటే నిర్వాహకులే అంతా చూసుకుంటారు. వారి వాహనాల్లో అటవీ ప్రాంతానికి తరలిస్తారు. మధ్యలో మరో వాహనంలోకి మారుస్తారు. అక్కడి నుంచి అడ్డాకు చేరుస్తారు. నిర్వాహకుల్లో ఒకరిని మాస్, మరొకరిని మిర్చి అంటూ కోడ్ భాషలో పిలుస్తారని సమాచారం.
Nizamabad District | అంతా కాయిన్స్ రూపంలో..
జూదం ఆడే సమయంలో ఒకవేళ పోలీసులకు పట్టుపడితే నగదు లభించకుండా జాగ్రత్త పడుతున్నారు. కాసినో కాయిన్స్ తరహాలో పోకర్ చిప్స్ ముద్రించి, ఒక్కో కాయిన్‌కు ఒక్కో విలువను పెట్టుకున్నారు. ఇలా నిత్యం లక్షల్లో జూదం కొనసాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో నయా ట్రెండ్‌లో ఇంత పెద్ద ఎత్తున దందా సాగుతుండడంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.