అక్షరటుడే, బోధన్: Ande sri | తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ మట్టిలో మాణిక్యం అని బోధన్ జేఏసీ (Bodhan JAC) ప్రతినిధులు పేర్కొన్నారు. అందెశ్రీకి మృతికి సంతాపంగా ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద జేఏసీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
అనంతరం తెలంగాణ జేఏసీ కన్వీనర్ గోపాల్ రెడ్డి (Telangana JAC convener P Gopal Reddy) మాట్లాడుతూ.. అందెశ్రీ స్కూల్‌కు వెళ్లకపోయినా గొప్ప సాహితీవేత్తగా పేరు గడించారన్నారు. చిన్నతనంలో గొర్ల కాపరిగా, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసినప్పటికీ సామాజిక స్పృహతో శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవారన్నారు. పాఠశాలలో కళాశాలలో చదివిన వారికన్నా మెండుగా రచనలు చేశారని వెల్లడించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా బోధన్ పట్టణంలో 1,519 రోజులు నిరాహార దీక్ష చేసిన సమయంలో అందెశ్రీ బోధన్‌కు వచ్చి ఉద్యమానికి మద్దతు తెలిపారన్నారు. ఆయన మృతి తీరని లోటు అని ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి బి.మల్లేష్, నాయకులు అడ్వకేట్ శ్యాంరావు, సాయిబాబా గౌడ్, సుధాకర్ చారి, అడ్వొకేట్ హనుమంతరావు, విద్యాసాగర్, జి.సీతారాం, ఎస్కే కాజా, అంజాద్ ఖాన్, ఎస్కే నజీర్, ఈర్షద్, గాండ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.
