అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers Day | ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు (Farmer) పట్టెడు అన్నం దొరకని పరిస్థితి. భూమిని నమ్ముకొని బతికే రైతులు ఏటా నష్టాల పాలు అవుతూనే ఉన్నారు. మంగళవారం రైతు దినోత్సవం (Farmers Day) సందర్భంగా.. అన్నదాతల ఆవేదనలపై కామారెడ్డికి చెందిన శ్రీరామ్ కవితగా రాశారు.
ఆకు పచ్చ చందమామ
స్వేదం చిందించి సేద్యం చేసే ఆకు పచ్చ చంద మామ రైతన్న
తరాలు మారినా తల రాత మారని బతుకు నీది
కల్లబొల్లి మాటలకు కడుపుబ్బి పోతావు
నిన్ను నిండా ముంచినా.. నియ్యత్ దప్పవు
ఆకలితో అలమటించే అన్నార్తులను అక్కున చేర్చుకుంటావు
బురదలో నుంచి బువ్వను తీస్తావు
పది మందికి అన్నం బెట్టి నువ్వు పస్తులుంటావు
దేశానికి వెన్నెముక అంటారు
నీ వెన్ను విరిచే విధానాలు తెస్తారు
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు ఇవ్వరు గిట్టు బాటు
దిక్కులు చూస్తూ అవుతావు నువ్వు నగుబాటు
అతివృష్టి, అనావృష్టి చుట్టు ముట్టినా చెదరని గుండె నీది
చీడపీడలు, వన్యప్రాణుల జాడలు దేనికీ జడవని ధైర్యం నీది
ఎన్ని విపత్తులు ఎదురైనా చెక్కు చెదరని గుండె నీది
మొక్కవోని ధైర్యం నీది
పైరు పచ్చగా ఉంటే కడుపు నింపుకునే నీవు…
అప్పులు కుప్పలై పరువు పజీతై ఎడ్ల కొమ్ముల పలుపు తాడే ఉరి తాడుగా పురుగుల మందే పెరుగన్నమై బలిమి చావు చస్తే
ఈ ప్రపంచానికి పట్టెడన్నం పెట్టే నీ జాతి ఏమై పోవాలి…
లే తిరగబడు నువ్వు పండించిన పంటకు గిట్టు బాటు వచ్చేదాక
నువ్వు పండించిన పంటకు నువ్వే ధర నిర్ణయించే వరకు తలపడు కలెవడు..
– డి.శ్రీరాం, జర్నలిస్టు