అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police Department | పోలీసు శాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు. సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష పడేలా పోలీసులు చట్టాలను అమలు చేస్తారు.
కానీ, పోలీసులే తప్పిదానికి పాల్పడితే..! అంతకన్నా పెద్ద తప్పు మరోటి ఉండదు. అలాంటిది గతంలో అత్యాచారయత్నం కేసులో ఇరుక్కున్న ఓ ఇన్స్పెక్టర్కు ప్రస్తుతం కీలకమైన సర్కిల్ బాధ్యతలు అప్పగించడం సొంత శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది.
Police Department | ఓ జిల్లాలో పనిచేసే సమయంలో..
గతంలో ఓ జిల్లాలో పనిచేసే సమయంలో మైనర్ బాలికపై సదరు ఇన్స్పెక్టర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన 2024లో చోటు చేసుకుంది. కాగా.. అతడిపై పోక్సో సహా అత్యాచారయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తదనంతరం అతగాడిని విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత తిరిగి కొద్ది నెలలకు విధుల్లో చేర్చుకున్నారు.
అనంతరం లూప్లైన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా మల్టీ జోన్–1 పరిధిలోని ఓ జిల్లాలో కీలకమైన సర్కిల్ బాధ్యతలు అప్పగించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇందుకోసం ప్రత్యేకంగా డీవో విడుదల చేయడం గమనార్హం.
Police Department | తీవ్ర ఆరోపణలు..
సదరు ఇన్స్పెక్టర్పై తీవ్ర ఆరోపణలు ఉన్న విషయం ఉన్నతాధికారులకు తెలుసు. పైగా పోక్సో కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది. ఇలాంటి సమయంలో లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇవ్వడం ఏమిటనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పోస్టింగుల్లో ఉంటే అధికారం, పలుకుబడి అడ్డు పెట్టుకుని బాధితులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ తెలిసి మల్టీ జోన్–1 అధికారులు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయడం, సదరు అధికారి బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగిపోయాయి.
పైగా ఇసుక అక్రమ రవాణాకు పెట్టింది పేరుగా ఉన్న సదరు సర్కిల్‌కు ఈ అధికారిని సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమించారు. స్థానిక ఎమ్మెల్యే ఏరి కోరి మరీ సదరు అధికారిని తన నియోజకవర్గానికి తెప్పించుకోవడం కొసమెరుపు. మరోవైపు తీవ్రమైన కేసులో ఉన్న అధికారికి పోస్టింగు ఇవ్వడంపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి ఏకంగా లా అండ్ ఆర్డర్ పోస్టింగులు ఇవ్వడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సదరు సీఐకి సంబంధించిన పోక్సో కేసు విచారణ దశలో ఉంది. ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్తే.. పోలీసు శాఖ పరువు దిగజారే ప్రమాదం ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు ముందే కనువిప్పు కావాల్సి ఉంది.