అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు (Teacher) కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారి అకృత్యాలను బయటకు ఎలా చెప్పాలో తెలియక బాలికలు సతమతమవుతున్నారు.
ఈ మధ్యకాలంలో పోలీసులు, అధికారులు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో విద్యార్థినులు తమకు జరుగుతున్న అన్యాయాలను ఒక్కొక్కటిగా బయటకు వెల్లడిస్తున్నారు.
తాజాగా.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై బాన్సువాడలో పోలీసులు పోక్సో కేసు (Pocso Act) నమోదు చేశారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ (Tadkol) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Zilla Parishad High school) విధులు నిర్వహిస్తున్న గణిత ఉపాధ్యాయుడు గణపతిపై పొక్సో కేసు నమోదైనట్లు ఎంఈవో నాగేశ్వరరావు తెలిపారు.
ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే పలువురు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు (Collector Ashish Sangwan) ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు (MEO), చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ అధికారి (Child Welfare Protection) స్రవంతి విచారణ చేపట్టారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తేలడంతో ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.