అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | భారీవర్షాల కారణంగా వరద తాకిడితో పోచారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో వరద వస్తుండడంతో ప్రాజెక్టు అలుగు పైనుండి సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి నీరు పారుతోంది. దీంతో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని అధికారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Pocharam Project | ప్రాజెక్టు ఓవర్హెడ్ వద్ద గండి..
ప్రాజెక్టు ఓవర్హెడ్ (Project overhead) వద్ద భారీ గండి పడి అందులోనుంచి సైతం వరద ఉధృతంగా దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వరద బీభత్సం గంటగంటకు పెరుగుతోంది. ప్రాజెక్టు చరిత్రలో అత్యధికంగా వరద వస్తోంది. ప్రస్తుతం జలాశయంలోకి 1,40,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Pocharam Project | పోచారం ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా వరద..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుగా మారడంతో పాటు జలాశయం పైనుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టుపై 8 అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహించడం ఇదే ప్రథమమని నీటిపారుదల శాఖ (Irrigation Department) అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు 70,000 నుంచి 80,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చేదని ప్రస్తుతం లక్షా నలభై వేల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ప్రాజెక్టు వద్ద ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు వద్ద గండిపడడంతో అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
