అక్షరటుడే, వెబ్డెస్క్ : Pocharam Project | వందేళ్ల క్రితం నిర్మించిన పోచారం ప్రాజెక్టు భారీ వరద(Heavy Flood)ను సైతం తట్టుకుంది. సామర్థ్యానికి మించి మూడు రెట్ల మేర అధికంగా వరద పోటెత్తినా ఠీవీగా నిలబడింది. భారీ ముప్పు నుంచి పోచారం ప్రాజెక్టు బయట పడిన తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
శతాబ్ద కాలం నిర్మించిన పోచారం జలాశయం(Pocharam Reservoir) ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటే, కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కుంగిపోయిన అంశం మరోసారి చర్చనీయాంశమైంది. రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పేరొందిన కాళేశ్వరం స్వల్పకాలంలోనే పడకేసిన వైనం తెర పైకి వచ్చింది. నిజాం పాలకుల హయాంలో సున్నపురాయితో నిర్మించిన పోచారం భారీ వరదను తట్టుకుని నిలబడితే, అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రఖ్యాత ఇంజినీరింగ్ నిపుణులు అందరూ భాగస్వామ్యం పంచుకున్న కాళేశ్వరం పనికి రాకుండా పోయిన వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Pocharam Project | భారీ వరదలను తట్టుకుని..
నిజాం హయాంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు(Pocharam Project) భారీ ముప్పు నుంచి సురక్షితంగా బయట పడింది. 1917లో నిర్మించిన ఈ ప్రాజెక్టు సామర్థానికి మించి దాదాపు మూడు రెట్ల మేర అధికంగా వరద వచ్చినా నిటారుగా నిలబడింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు వచ్చే గరిష్ట వరద సామర్థ్యం 70 వేల క్యూసెక్కుల లోపే. కానీ బుధవారం కురిసిన అత్యంత భారీ వర్షాలతో ఈ జలాశయానికి వరద పోటెత్తింది. 1.82 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినా తట్టుకుని నిలబడింది. వరద తీవ్రతకు ప్రాజెక్టు గేట్ల అంచున మట్టి కొట్టుకుపోయి భారీ గుంత ఏర్పడినా జలాశయం మాత్రం చెక్కు చెదరలేదు.
Pocharam Project | విఫల ప్రాజెక్టు కాళేశ్వరం
నిజాం పాలకుల హయాంలో అప్పట్లో రూ.17 లక్షలు వెచ్చించి నిర్మించిన పోచారం ప్రాజెక్టు వందేళ్లు దాటినా పటిష్టంగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ వరద సామర్థ్యం 70 వేల క్యూసెక్కులు కాగా ఏకంగా 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకుని నిలబడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోచారం ప్రాజెక్టు నాణ్యత గురించి చర్చ జరుగుతున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భారీ ఎత్తిపోతల పథకం విఫలమైన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయగా భావించే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు రావడంతో మొత్తం ప్రాజెక్టే నిరర్థకంగా మారింది. కట్టిన మూడేళ్లకే పిల్లర్లు కుంగి, పగుళ్లు వచ్చి మేడిగడ్డ బ్యారేజీ పనికి రాకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నాసిరకం పనులు, పోచారం జలాశయ నిర్మాణంలో పాటించిన నాణ్యమైన పనులు చర్చనీయాంశంగా మారాయి.