అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ఆయన జెండా ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. యువత కోసం పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం (PM Vikasit Bharat Rozgar Yojana Scheme) ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు రూ.15వేలు లబ్ధి చేకూరుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం (Central Government) తాజాగా ప్రవేశ పెట్టిన పథకం నేటి నుంచి అమలులోకి వస్తుందని మోదీ తెలిపారు. దీంతో 3.5 కోట్లకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కొత్తగా ప్రైవేట్ ఉద్యోగం సాధించిన యువతకు ప్రభుత్వం నేరుగా రూ.15 వేల సాయం అందిస్తుందన్నారు. ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టించే కంపెనీలకు కూడా ఈ పథకం కింద ప్రోత్సాహకాలను అందిస్తామని మోదీ ప్రకటించారు.
PM Modi | కీలక ఖనిజాల కోసం పరిశోధనలు
కీలక ఖనిజాల కోసం దేశంలోని 1,200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని మోదీ (PM Modi) తెలిపారు. యువత శక్తి, సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందన్నారు. ఫైటర్ జెట్లకు మేడిన్ ఇండియా ఇంజిన్లను అమర్చడంపై దృష్టి పెడతామని తెలిపారు. దేశంలో 10 కొత్త అణు రియాక్టర్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 2047 నాటికి దేశంలో అణు విద్యుత్‌ను పది రెట్లు పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ దిగుమతులపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పీఎం తెలిపారు. కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
PM Modi | మేడిన్ ఇండియా చిప్స్
దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి చర్యలు చేపట్టినట్లు ప్రధాని వివరించారు. త్వరలో మేడిన్ ఇండియా చిప్స్ (Made in India Chips) మార్కెట్లో రాజ్యమేలుతాయని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నాలుగు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. సోలార్ పవర్ సామర్థ్యాన్ని మూడు రెంట్లు పెంచినట్లు వివరించారు. సముద్రంలో చమురు వెలికితీతకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
PM Modi | స్వదేశీ మంత్రంతో..
యువత దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మనం ఎందుకు ఆధారపడాలని ఆయన ప్రశ్నించారు. యువ ఇంజినీర్లు, అధికారులకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. యువతకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరం అయ్యే పరికరాలను మనమే తయారు చేసుకుందామన్నారు. స్వదేశీ మంత్రంతో అడుగులు ముందుకు వేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. భారత్‌లో తయారైన వస్తువులనే కొనుగోలు చేసి ఉపయోగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ట్రంప్ ఇటీవల భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.