HomeUncategorizedPM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ.. 15 నుంచి మూడు దేశాల పర్యటన

PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ.. 15 నుంచి మూడు దేశాల పర్యటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మూడు దేశాల్లో ఐదు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. జూన్ 15 నుంచి 19వ తేదీ వరకు సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలకు ప్రధాని వెళ్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. జూన్ 15-16 తేదీలలో ప్రధాని మోదీ సైప్రస్ ను సందర్శించనున్నారు. ఆ తర్వాత జూన్ 16-17 తేదీలలో కెనడాలోని కననాస్కిస్ లో జరిగే G-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. జూన్ 18న క్రొయేషియాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.

PM Modi | రెండు దశాబ్దాల తర్వాత సైప్రస్ కు..

సైప్రస్ దేశానికి భారత ప్రధాని (Indian Prime Minister) వెళ్లడం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఆ దేశాధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఆహ్వానం మేరకు మోదీ సైప్రస్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. “సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ (PM Modi) జూన్ 15-16 తేదీలలో ఆ దేశంలో పర్యటించనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ కు చేసిన మొదటి పర్యటన ఇది. నికోసియాలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షుడు క్రిస్టోడౌలైడ్స్ తో చర్చలు జరుపుతారు. లిమాసోల్లో వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు” అని విదేశాంగ శాఖ వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్ తో ఇండియా సంబంధాలను బలోపేతం చేయడానికి రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుందని అభిప్రాయపడింది.

PM Modi | జీ-7 సదస్సులో పాల్గొననున్న మోదీ..

కెనడాలో జరిగే G-7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ (Canada Prime Minister Mark Carney) ఆహ్వానం మేరకు మోదీ జూన్ 16-17 తేదీలలో కెనడాలోని కననాస్కిస్ లో పర్యటించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ G-7 దేశాల నాయకులు, ఇతర ఔట్రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా AI-శక్తి అనుసంధానం, క్వాంటం-సంబంధిత సమస్యలతో పాటు కీలకమైన ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ అనేక ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. అనంతరం, క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ (Croatian Prime Minister Andrej Plenkovic) ఆహ్వానం మేరకు మోదీ జూన్ 18న క్రొయేషియాకు వెళ్లనున్నారు. భారత ప్రధాని క్రొయేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. మోదీ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రధాని మోదీ ప్రధాన మంత్రి ప్లెన్కోవిక్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్తో సమావేశమవుతారు.