అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 31 నుంచి సెస్టెంబర్ 1వరకు చైనా (China)లో పర్యటించనున్నారు. టియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన పాల్గొననున్నారు. మోదీ చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించారు. అనంతరం 2020లో గాల్వన్ లోయలో చైనా –భారత్ మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. చైనా సైనికులు గాల్వన్‌లోకి చొచ్చుకురావడంతో జరిగిన ఇరు దేశాలకు చెందిన సైనికులు చనిపోయారు. అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ క్రమంలో మోదీ పర్యటనతో మళ్లీ సంబంధాలు మెరుగు పడే అవకాశం ఉంది.
PM Modi | ట్రంప్ టారిఫ్స్ వేళ..
భారత్ రష్యా (Russia) నుంచి ఆయిల్, ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత చాలా దేశాలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని ఆపేశాయి. ఈ క్రమంలో పుతిన్ ప్రభుత్వం భారత్, చైనాలకు తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేస్తామని ఆఫర్ చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత భారత్ భారీగా ఇంధనం కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇటీవల భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేగాకుండా సుంకాలు, పెనాల్టీలు మరింత పెంచుతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో మోదీ చైనా పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
PM Modi | కీలక పర్యటనలు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (NSA Ajith Doval) ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) కూడా త్వరలో రష్యా వెళ్లనున్నారు. ఇంధనం, ఆయుధాల కొనుగోలు అంశంపై ఆయన కీలక చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో మోదీ ఈ నెల 30న మొదట జపాన్‌లో పర్యటిస్తారు. అనంతరం చైనాకు వెళ్లారు. కాగా మోదీ 2019లో చైనాకు చివరిసారిగా వెళ్లినా.. 2024 అక్టోబర్‌లో రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు. ఈ సమావేశంలోనే ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గాయి. కైలాస్ మానస సరోవర యాత్రకు సైతం చైనా అనుమతి ఇచ్చింది.
PM Modi | మూడు దేశాలు కలుస్తాయా..
ప్రస్తుతం రష్యా, ఇండియా, చైనా బ్రిక్స్ (BRICS) కూటమిలో సభ్య దేశాలు. బ్రిక్స్ కరెన్సీ తీసుకు రావడానికి యత్నిస్తున్నాయి. దీంతో తమ డాలర్ ఆధిపత్యానికి గండి పడుతుందని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రంప్ చైనాపై సైతం గతంలో సుంకాలు విధించారు. దీంతో భారత్–చైనా బంధాలను మెరుగు పరుచుకోవడం ద్వారా అమెరికాకు చెక్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
షాంఘై సహకార సంస్థ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో 10 సభ్య దేశాలతో చర్చలు వాణిజ్యంతో పాటు ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రతపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిసింది. భారతదేశం-చైనా సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఎస్సీవోలో బెలారస్, చైనా, భారత్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.