అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vande Bharat Trains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్-వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ , ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో వందేభారత్ రైళ్లను శనివారం ఉదయం ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)కు ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. వేగంగా వెళ్లడంతో ఆధునిక హంగులతో ఉన్న ఈ రైళ్లకు ఆదరణ పెరిగింది. దీంతో రైల్వే శాఖ (Railway Department) వీటి సంఖ్యను పెంచుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు.
Vande Bharat Trains | మెరుగైన కనెక్టివిటీ
ప్రధాని (PM Narendra Modi) మాట్లాడుతూ.. వందే భారత్ రైళ్లు పౌరులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయన్నారు. దేశంలో మొత్తం పనిచేసే వందే భారత్ రైళ్ల సంఖ్య ఇప్పుడు 160 దాటిందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు కొత్త తరం భారతీయ రైల్వేలకు పునాది వేస్తున్నాయి అని అన్నారు. విదేశీ ప్రయాణికులు కూడా వందే భారత్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలు ప్రధాన అంశం అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ కూడా అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
Vande Bharat Trains | రైళ్ల ప్రత్యేకతలు
బనారస్-ఖజురహో వందే భారత్ రైలు ఈ మార్గంలో ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే రెండు గంటల 40 నిమిషాలు ఆదా చేస్తుందని కేంద్రం తెలిపింది. లక్నో-సహరాన్‌పూర్ వందే భారత్ ప్రయాణాన్ని దాదాపు ఏడు గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుందని, దీంతో ఒక గంట ప్రయాణ సమయాన్ని ఆదా అవుతుందని పేర్కొంది. ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందే భారత్ ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు అవుతుంది. ఆరు గంటల 40 నిమిషాల్లో గమ్య స్థానాన్ని చేరుకుంటుంది. ఎర్నాకులం-బెంగళూరు వందే భారత్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా ఆదా చేస్తుంది.
