అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Plane Crashes | అమెరికా(America)లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మోంటానాలోని కాలిస్పెల్ సిటీ విమానాశ్రయం(Kalispell City Airport)లో ల్యాండ్ అవుతున్న చిన్న విమానం, అప్పటికే రన్‌వే పై నిలిపి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో భారీ మంటలు చెలరేగగా, చుట్టూ దట్టమైన పొగలు అలముకున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో(Police Chief Jordan Venezia) మరియు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(Federal Aviation Administration) వివరాల ప్రకారం, ఈ ప్రమాదం సొమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది.
Plane Crashes | ప్రమాదం తప్పింది..
నలుగురు ప్రయాణికులతో కూడిన సోకాటా TBM 700 టర్బోప్రాప్ సింగిల్ ఇంజిన్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో, రన్‌వే పై ఆగి ఉన్న ప్రయాణికులు లేని మరో విమానాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే మంటలు భారీగా వ్యాపించాయి. అయితే విమానంలోని పైలట్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. ఇద్దరు స్వల్పంగా గాయపడగా, వారికి విమానాశ్రయంలోని వైద్య బృందం వెంటనే ప్రాథమిక చికిత్స అందించింది. ఘటనకు గురైన విమానం 2011లో తయారైనదని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదం విమానాశ్రయంలో ఓ కొద్ది సమయం పాటు కలకలం రేపింది. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
మోంటానా విమానాశ్రయం(Montana Airport) 30వేల జనాభా కలిగిన కాలిస్పెల్ నగరానికి దక్షిణంగా ఉంది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన విమానం మంటల్లో చిక్కుకోవడంతో అందరు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పైలట్‌తో పాటు ప్రయాణికులు వెంటనే బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడ్డ వారికి విమానాశ్రయంలో చికిత్స అందించామని కాలిస్పెల్ అగ్నిమాపక అధికారి జే. హేగెన్ తెలియజేశారు.