అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం (Ahmedabad Plane Crash) దేశంలో తీరని విషాదం నింపింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే లండన్ వెళ్తున్న విమానం క్రాష్ అయింది. మంటలు అంటుకొని విమానంలోని చాలా మంది సజీవ దహనం అయ్యారు. మృతులు, క్షతగాత్రులతో ఆ ప్రాంతం అంతా బీతావహ పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు సజీవ దహనం కావడంతో మాంసం ముద్దలుగా మారారు. అయితే ఈ ప్రమాదంలో అంతా మరణించినట్లు అందరూ భావించారు. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం మృత్యుంజయుడిలా ప్రాణాలతో (survived) బయట పడ్డాడు. ప్రమాదం తర్వాత రమేష్ విశ్వాస్‌కుమార్ అనే ప్రయాణికుడు నడుచుకుంటూ బయటకు వచ్చాడు. 11A సీటులోని ప్రయాణిస్తున్న ఆయన ఘోర ప్రమాదంలో నుంచి బయటపడ్డాడు. ప్రమాదం అనంతరం ఆయన నడుచుకుంటూ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
విమాన ప్రమాదంలో ప్రయాణికులు, పైలెట్లు, సిబ్బంది మరణించారు. వీరితో పాటు ఫ్లైట్ ఓ భవనాన్ని ఢీకొనడంతో అందులో ఉన్న మెడికల్ కాలేజీ (Medical College) విద్యార్థులు సైతం మరణించారు. ఆ భవనం పక్కన ఉన్న స్థానికులు కూడా మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం ఎంత మంది చనిపోయారనేది ఇంకా అధికారులు ప్రకటించలేదు. అయితే ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు మాత్రం చేపడుతున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.
Plane Crash | కుటుంబాన్ని కలవడానికి వచ్చి..
ఎమర్జెన్సీ గేటు నుంచి దూకి రమేశ్ ప్రాణాలతో బయట పడ్డట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం రమేశ్ మాట్లాడుతూ.. తాను యూకే పౌరుడినని చెప్పాడు. టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్ధం వచ్చి విమానం కూలిపోయిందన్నారు. లండన్‌లో 20 ఏళ్లుగా ఉంటున్న రమేశ్.. తన కుటుంబాన్ని కలిసి వెళ్దామని ఇండియాకు వచ్చానని చెప్పాడు. అయితే తాను లేచే సరికి చుట్టూ విమాన శకలాలు ఉన్నాయని తెలిపాడు. విమానంలో తన తమ్ముడు కూడా ఉన్నాడని, వెతికి పెట్టాలని కోరాడు.