అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ (Godavari Drinking Water) సప్లై పథకంలో పైప్లైన్ శుక్రవారం మధ్యాహ్నం లీకైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు మరమ్మతు పనులను వేగంగా చేపడుతున్నారు.
కరీంనగర్ జిల్లా (Karimnagar District) బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలోని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ లీకేజీ అయింది. దీంతో హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగింది. శనివారం ఉదయం ఆరు గంటల వరకు మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు మొదట తెలిపారు. అయితే ఇంకా పనులు కొనసాగుతున్నాయి. మరమ్మతులపై ఎండీ అశోక్ రెడ్డి (MD Ashok Reddy) జలమండలి ఈడీతో కలిసి అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు.
Hyderabad | ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
లీకేజీతో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని ఎండీ సచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. మరమ్మతు ప్రాంతంలో ఉన్నతాధికారుల బృందం పర్యవేక్షించేందుకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Hyderabad | రాత్రి వరకు పూర్తి
శ్రీనివాస్ నగర్ (Srinivas Nagar) వద్ద ఇప్పటికే డీ వాటరింగ్ పనులు పూర్తి చేసి వెల్డింగ్ పనులు మొదలుపెట్టామని అధికారులు తెలిపారు. వెల్డింగ్ పనులు శనివారం సాయంత్రం 4 గంటలకు పూర్తి అవుతాయన్నారు. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు పనులు పూర్తి చేసి, నీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకోవాలని, ప్రజలందరూ ఈ సమయంలో నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని కోరారు.