అక్షరటుడే, భీమ్‌గల్: Balkonda MLA | రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు ఒక్క మన పార్టీకే ఉందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Mla Prashanth Reddy) అన్నారు. వేల్పూర్‌లోని తన నివాసంలో భీమ్‌గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality) ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భీమ్‌గల్ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ (BRS party) పార్టీదేనన్నారు. కార్యకర్తలందరూ బేషజాలు వీడి సమిష్టిగా పనిచేసి భీమ్‌గల్ కోటపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
Balkonda MLA | ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి..
గతంలో భీమ్‌గల్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజల సౌకర్యార్థం దానిని మున్సిపాలిటీగా మార్చుకున్నామని వేముల గుర్తుచేశారు. ‘నేను ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో 2016లో భీమ్‌గల్ గల్లీగల్లీ తిరిగాను. అప్పట్లో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. వెంటనే ప్రణాళిక సిద్ధం చేసి, కేటీఆర్ (KTR) సహకారంతో రూ. 25 కోట్లు మంజూరు చేయించి అంతర్గత రోడ్లను నిర్మించుకున్నాం. ఆ తర్వాత ఆర్అండ్‌బీ మంత్రిగా భీమ్‌గల్ ప్రధాన రహదారులను సెంట్రల్ లైటింగ్, డివైడర్లతో సుందరంగా తీర్చిదిద్దాం’ అని వివరించారు.
Balkonda MLA | పనులన్నీ నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మరో రూ.10 కోట్లతో మంజూరైన పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కావాలనే అడ్డుకుందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. టెండర్లు పూర్తయిన పనులను కూడా రెండేళ్లుగా నిలిపివేశారని, కనీసం తట్టెడు మట్టి కూడా తీసిన దాఖలాలు లేవని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల అర్ధంతరంగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంజూరైన పనులకే ఇప్పుడు మంత్రులను తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టించడం హాస్యాస్పదమన్నారు.
Balkonda MLA | హామీలు విస్మరించిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని వేముల విమర్శించారు. ‘రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. రైతుబంధు రావడం లేదు, ఎరువుల పంపిణీలో వైఫల్యం చెందారు. మహిళలకు రూ. 2,500, ఆసరా పింఛన్ రూ.4,000 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ప్రజలు కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం’ అని అన్నారు.
Balkonda MLA | ఇంటింటికీ తిరుగుతా..
రాష్ట్రంలోనే గతంలో అన్ని కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న ఏకైక మున్సిపాలిటీ భీమ్‌గల్ అని, ఆ చరిత్రను మళ్ళీ పునరావృతం చేయాలని క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ‘పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కోసం నేను స్వయంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తాను. కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఉండకూడదు. ప్రజలు మన వైపే ఉన్నారు, విజయం మనదే’ అని వేముల ప్రశాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.