అక్షరటుడే, కోటగిరి: Pothangal | పాదయాత్ర ద్వారా శబరిమల (Sabarimala) దర్శనం అపూర్వఘట్టమని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. పోతంగల్ మండల (Potangal mandal) కేంద్రం నుంచి నవంబర్ 2న పాదయాత్రగా వెళ్లిన స్వాములు బుధవారం తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి పటాకులు కాలుస్తూ యువకులు, గ్రామస్థులు స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతించారు.
మండలానికి చెందిన సూదాం వెంకటేష్, నాగేశ్వరరావు ఈరవంత్ రావు పటేల్, గజ్జు పటేల్, ఉమేష్ కన్నె స్వామి పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా గంగాధర్ పటేల్ (గజ్జుస్వామి) మాట్లాడుతూ.. ఒక్కసారైనా పాదయాత్ర చేస్తూ శబరిమలను దర్శనం చేసుకోవడం అద్భుతమన్నారు. 12వ పాదయాత్ర చేసిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బాన్సువాడ వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రతిరోజు 40 కిలోమీటర్లు కొనసాగిందన్నారు. వైకుంటపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పడిపూజతో మొదలై అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని చేరుకునే వరకు 35 పడిపూజలు ఉంటాయని పేర్కొన్నారు.
Pothangal | ప్రతిరోజు ఉదయం రాగిజావా..
ప్రతిరోజు ఉదయం రాగి జావా, పాలు మార్గమధ్యలో ఉప్మా, పూరి అల్పాహారంగా తీసుకున్నామన్నామని నాగేశ్వరరావు తెలిపారు. మొదటిసారి పాదయాత్ర చేసిన సూదాం వెంకటేష్ మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్నారు. 1600 కి.మీ 43 రోజులు విజయవంతంగా పాదయాత్ర ముగించుకొని, శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శనం చేసుకుని వచ్చామని అన్నారు.
24వ సారి మాలధారణ చేసిన శంకర్ గురుస్వామి మాట్లాడుతూ.. పాదయాత్రలో కాళ్లకు అనేక ఇబ్బందులు ఏర్పడినప్పటికి విజయవంతంగా యాత్ర పూర్తిచేయడం అద్భుతమన్నారు. 15రోజుల పాటు గోరు వెచ్చని నీటిలో, కర్పూరం పసుపు వేసి పదినిమిషాలు పాదాలు ఉంచాలని అయితే పాదాల నొప్పులు తగ్గుతాయని వివరించారు. కార్యక్రమంలో స్వాములు లాలయ్య, హరీష్ సేట్, యశ్వంత్ రెడ్డి, నరేష్ గౌడ్, సీతలే రమేష్, గ్రామ పెద్దలు, గంధపు పవన్, కేశ వీరేశం, బజరంగ్, గంట్ల విఠల్, రాజు తదితరులు పాల్గొన్నారు.