అక్షరటుడే, కామారెడ్డి: Phone tapping case | రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కామారెడ్డి నుంచి కేసీఆర్ (Former CM KCR) పోటీ చేయడంతో కామారెడ్డి అడ్డాగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు వినిపించాయి. తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని కామారెడ్డి కాంగ్రెస్ నేతలు కూడా గతంలో చెప్పడంతో ఇప్పుడు వారికి పోలీసుల నుంచి పిలుపు వస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ (Congress Party Legal Advisor) దేవరాజ్ గౌడ్‌కు సిట్ నుంచి పిలుపు రాగా తాజాగా ఇటీవల టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా (TPCC General Secretary) నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ నుంచి పిలుపు వచ్చింది.
దీంతో బుధవారం ఆయన తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాటి బీఆర్ఎస్ నాయకులలో టెన్షన్ మొదలైందన్న ప్రచారం సాగుతోంది. కామారెడ్డి పట్టణంలోని (kamareddy) విద్యానగర్ కాలనీ అడ్డాగా ట్యాపింగ్ చేశారని ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ నాయకులకు ఈ బాధ్యత అప్పగించినట్లుగా అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం కామారెడ్డి నుంచి ఇద్దరికి సిట్ నుంచి పిలుపు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం బీఆర్ఎస్ నాయకుల మెడకు చుట్టుకుంటుందా అనే చర్చ సాగుతోంది.
