అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర షాకిచ్చింది. రేపు (డిసెంబర్ 12) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో (Jubilee Hills Police Station) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు బేషరతుగా లొంగిపోవాలని (సరెండర్) ఆదేశించింది. అదే సమయంలో, అరెస్టు అనంతరం ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దర్యాప్తునకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణల మధ్య కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేసుతో సంబంధం ఉన్న కీలక ఐఫోన్లకు చెందిన iCloud ఖాతాల పాస్వర్డ్లను పూర్తిగా మార్చేసి, ఏ మాత్రం సమాచారం అందజేయకుండా అడ్డుకుంటున్నారని SIT అధికారులు ప్రభాకర్ రావుపై (Prabhakar Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన మధ్యంతర అరెస్ట్ ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు.. ప్రభాకర్ రావు రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో SIT అధికారుల సమక్షంలో బేషరతుగా లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.