అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావు (Former MP Santosh Rao)కు సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవల సిట్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్ (KTR)లను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇద్దరిని వేర్వేరు రోజుల్లో విచారణకు పిలిచిన అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును ప్రశ్నించారు. కీలక నిందితుడు ప్రభాకర్‌రావును కస్టడీకి తీసుకొని కీలక వివరాలు రాబట్టారు. తాజాగా మాజీ ఎంపీ సంతోష్‌రావుకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు.
Phone tapping case | బిగుస్తున్న ఉచ్చు
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ (BRS) హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. తన భర్త ఫోన్‌ను సైతం ట్యాప్ చేశారని కవిత పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సైతం ఆరోపించారు. ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదు అయి రెండేళ్లు కావొస్తుంది. అయినా కొలిక్కి రాకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు తర్వాత విచారణ వేగవంతం అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. దీంతో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని పలువురు అంటున్నారు. ఆయనను సైతం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Phone tapping case | వారం వ్యవధిలో..
మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు గత మంగళవారం విచారించారు. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ఫోన్ సైతం ట్యాప్ అయినట్లు అధికారులు ఆయనకు ఆధారాలు చూపినట్లు సమాచారం. అనంతరం సిట్ ఈ నెల 23న (శుక్రవారం) కేటీఆర్‌ను ప్రశ్నించింది. తాజాగా సంతోష్‌రావుకు నోటీసులు ఇచ్చింది. వారం వ్యవధిలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుటుంబానికి చెందిన ముగ్గురిని సిట్ విచారణకు పిలవడం గమనార్హం.