అక్షరటుడే, వెబ్‌డెస్క్: DSP Praneeth Rao | ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రణీత్‌రావు డీఎస్పీ హోదాను రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దుగ్యాల ప్రణీత్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేసి, అరెస్ట్ కూడా చేశారు. డీఎస్పీ పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్ సమయంలో అతడు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో డీఎస్పీ పదోన్నతి రద్దు చేశారు. ఇక నుంచి ఆయన ఇన్స్పెక్టర్గా కొనసాగనున్నారు. హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్ (C.V. Anand) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
DSP Praneeth Rao | యాక్సిలరేటెడ్ పదోన్నతి
బీఆర్ఎస్ (BRS) హయాంలో ప్రణీత్‌రావుకు యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించి డీఎస్పీ హోదా ఇచ్చారు. అయితే ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల అణచివేతలో పాల్గొన్న అధికారులకు మాత్రమే ఈ రకంగా పదోన్నతి కల్పిస్తారు. ప్రణీత్‌రావు విషయంలో మాత్రం అలాంటి పనులు చేయకపోయినా.. డీఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రణీత్‌రావు 2007లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆ బ్యాచ్‌లో 300 మంది ఎస్సైలు ఉండగా.. ఆయన ఒక్కరు మాత్రమే డీఎస్పీగా ప్రమోషన్ పొందడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి ప్రభుత్వ పెద్దలకు సహకరించినందుకే పదోన్నతి కల్పించారనే ఆరోపణలు వచ్చాయి.
DSP Praneeth Rao | ఎస్ఐబీకి బదిలీ అయ్యాక..
స్పెషల్ ఇంటెలిజెన్స్ (Special Intelligence) విభాగానికి ఎస్సై హోదాలో ప్రణీత్‌రావు 2016లో బదిలీ అయ్యారు. 2023 డిసెంబరు 13 వరకు అక్కడ పని చేశారు. ఎస్ఐబీలోనే ఆయన సీఐగా, డీఎస్పీగా పదోన్నతి పొందడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాలు వెలువడిన తర్వాత ప్రణీత్‌రావు ఎస్ఐబీ భవనంలోని సీసీ కెమెరాలను స్విచ్ఆఫ్ చేశాడ. ఎస్వోటీ లాగర్‌రూంలోని ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, డేటాను ధ్వంసం చేశాడని సిట్ అధికారులు గుర్తించారు.