Nizamabad City
Nizamabad City | మూడంతస్తులకు అనుమతి.. ఆరంతస్తుల్లో నిర్మాణం..

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad City | నిజామాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాలకు (Illegal constructions) అడ్డూఅదుపు లేకుండా పోయింది. పేరుకు కాగితాలపై ఒక పర్మిషన్‌ తీసుకుని.. క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారు. ప్రధాన రహదారుల వెంబడే భారీ భవంతులు నిర్మిస్తున్నా.. నగరపాలక సంస్థ అధికారులు చోద్యం చేస్తున్నారు. కొందరు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు (town planning officials) దగ్గరుండి మరీ అండదండలు అందిస్తున్నారు.

నగరపాలక సంస్థ ప్రక్షాళన చేపడుతామని అధికారులు ఊదరగొడుతున్నారు. ఆ దిశగానే పలు విభాగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టినప్పటికీ.. కొందరు అధికారులు, సిబ్బంది తీరు మాత్రం మారట్లేదు. నిజామాబాద్‌ నగరంలోని (Nizamabad City) ఖిల్లా రోడ్డులో డోర్‌ నంబరు 9–4–107 పేరిట నగరపాలక సంస్థ అధికారులు బీపాస్‌ కింద బిల్డింగ్‌ అనుమతులు జారీ చేశారు. స్టిల్ట్‌ ప్లస్‌ 2 కింద అనుమతులు జారీ చేయగా.. సదరు బిల్డింగ్‌ యజమాని పూర్తి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం పూర్తి చేస్తున్నారు. 2022 నుంచి బిల్డింగ్‌ నిర్మాణం జరుగుతున్నా ఇప్పటివరకు అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Nizamabad City | ఉల్లంఘనలు ఇలా..

మొత్తం 203 స్వ్కేర్‌ యార్డ్స్‌లో ఈ భవనం నిర్మాణం చేపట్టారు. మార్టిగేజ్‌ (mortgage) నుంచి మినహాయింపు పొందేందుకు స్టిల్ట్‌ ప్లస్‌ 2 అనుమతి తీసుకున్నారు.

ఈ అనుమతుల ప్రకారం.. నాలుగు వైపులా సెట్‌బ్యాక్‌ వదిలిపెట్టి సెల్లార్‌, ప్లస్‌ రెండంతస్తులు మాత్రమే నిర్మాణం జరపాలి. కానీ, ఏకంగా ఆరు శ్లాబులు వేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు.

అదనంగా నాలుగు శ్లాబులు వేసి.. సెట్‌ బ్యాక్‌ లేకుండా బిల్డింగ్‌ పూర్తి చేసినా ఇప్పటివరకు నగరపాలక సంస్థ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. మరోవైపు ప్రధాన రహదారి వైపు 4 ఫీట్లు ఆక్రమించి బిల్డింగ్‌ నిర్మించారు. ఇంకోవైపు మున్సిపల్‌ సీసీ రోడ్డును (municipal CC road) ఆక్రమించారు.

Nizamabad City | టౌన్‌ప్లానింగ్‌ అధికారుల అండదండలు

సదరు అక్రమ కట్టడానికి సంబంధించి టౌన్‌ ప్లానింగ్‌లో పనిచేస్తున్న ఓ అధికారి అండదండలు అందించినట్లు సమాచారం. నగరపాలక సంస్థ కార్యాలయానికి (municipal corporation office) సమీపంలో ఉన్న ఓ ఇంజినీర్‌ దొడ్డిదారిలో భవన నిర్మాణానికి అనుమతి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ముందే ముడుపులు ముట్టడంతో అధికారులు, సిబ్బంది అక్రమ బిల్డింగ్‌ వైపు ఎవరూ పట్టించుకోలేదు. అక్రమ కట్టడాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటనలు చేసిన కమిషనర్‌ దీనిపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.