అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu | మన దేశంలో ప్రతి ప్రాంతానికొక ప్రత్యేక ఆచారం, సంప్రదాయం ఉంటుంది. కొన్నింటి వెనుక సాంఘిక, ఆధ్యాత్మిక అర్థాలు ఉండగా… మరికొన్ని వింతగా, కొన్ని మాత్రం ఆచారాల పేరిట భయానకంగా అనిపిస్తుంటాయి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో (Tamil Nadu) ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అటువంటి ఓ విభిన్నమైన, వింత ఆచారం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తమిళనాడులోని ధర్మపూరి జిల్లాలోని (Dharmapuri district) వింత ఆచారం గురించి తెలుసుకున్న అందరు అవాక్కవుతున్నారు. పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేయడంకి సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఇదేమి ఆచారంరా బాబు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tamil Nadu | ఇదొక వింత ఆచారం..
పెరియకరుప్పు ఆలయంలో (periyakaruppu temple) ఈ ఆచారం ఉంండగా, ప్రతి సంవత్సరం ఆడి అమావాస్య సందర్భంగా ఆలయ పూజారికి ఇలా కారం, పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో అభిషేకించడం సంప్రదాయంగా వస్తుంది. అయితే గురువారం ఆడి అమావాస్య (Aadi Amavasya) రావడంతో 108 కిలోల కారం, ఆరు కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో పూజారి గోవింద్‌కు (priest Govind) అభిషేకం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాక ఆ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం మాంసాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది.
కాగా, ప్రతి ఏటా ఆషాఢ మాసంలో (Ashadha masam) వచ్చే ఆడి అమావాస్య రోజున గ్రామ దేవత పెరియ కరుప్పసామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగలో పాలు, కారంపొడి, మద్యం, సిగరెట్లు వంటి ఎన్నో వస్తువులను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అభిషేకం జరిగే సమయంలో పూజారి కదలకుండా, నిశ్చలంగా ఉండటం ఈ ఆచారంలో ముఖ్య ఘట్టం. ఆయనపై మిరపకారం మిశ్రమాన్ని పోస్తున్నా ఒకింత బాధను కూడా వ్యక్తపరచకుండా ఉండటం భక్తుల్లో భక్తిభావాన్ని కలిగిస్తుంది. భక్తుల నమ్మకం ప్రకారం, ఈ అభిషేకం ద్వారా తమ దురదృష్టం, దుష్టశక్తులు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు. ఈ వేడుక అనంతరం పూజారి శరీరంపై ఉన్న కారం మరకలు పోయేంత వరకూ శుభ్రమైన మంచినీటిని లీటర్ల కొద్దీ గుమ్మరిస్తారు. కారంలాంటి పదార్థాన్ని శరీరంపై పోసినప్పటికీ పూజారి తట్టుకొని నిలబడటం చాలా మంది ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.