అక్షరటుడే, భీమ్‌గల్: Panchayat elections | పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థులకేనని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) అన్నారు.
భీమ్‌గల్ పట్టణంలోని (Bheemgal Town) కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఆదరణ లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు.
Panchayat elections | చీరల పంపిణీ.. వడ్డీలేని రుణాలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యత కలిగిన చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలు (interest-free loans) ఇస్తున్న సందర్భంలో ఇప్పటికే అయోమయంలో ఉన్న ప్రశాంత్ రెడ్డి అవి కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని అబద్దపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేదన్నారు. మాఫీ చేయాలనే ఆలోచన కూడా వారికి రాలేదని.. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోటి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంటే స్థానిక ఎమ్మెల్యే సహించలేకపోతున్నారన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఇందిరమ్మ చీరలను (Indiramma sarees) ఆడపడుచులు గ్రామాల్లో కట్టుకొని మురిసిపోతున్నారన్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు రోడ్లపై తగలబెట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు ఏనాడు కట్టుకోలేదన్నారు. ప్రశాంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడడం మానుకోకపోతే కచ్చితంగా స్థానిక సంస్థల్లో ప్రజలు ప్రశాంత్ రెడ్డికి బుద్ధి చెప్తామన్నారు.
బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్‌లో కేటీఆర్ (KTR) అధికారం పోవడంతో మతిస్థిమితం కోల్పోయి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ సానుభూతిపరులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ భీమ్‌గల్ నగర అధ్యక్షుడు నర్సయ్య, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేశ్, గోపాల్ నాయక్, అన్వేష్, మహేష్, దొంకంటి రాజేష్, నాగభూషణం, శ్యామ్ రాజ్, సాయి బాబా, నవీన్, పల్లికొండ అశోక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.