అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. అయితే చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు 9 గంటల వరకు కూడా ప్రజలు ఓటు వేయడానికి ఎక్కువగా బయటకు రాలేదు. 9 తర్వాత పోలింగ్ ఊపందుకుంది.
బతుకు దెరువు కోసం పల్లె ప్రజలు చాలా మంది హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు, వివిధ పట్టణాల్లో జీవిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వారంత పల్లె బాట పట్టారు. స్వగ్రామంలో ఓట్లు వేయడానికి పయనం అయ్యారు. కొంత మంది బుధవారమే ఇళ్లకు చేరుకోగా.. కొందరు గురువారం ఉదయం బయలు దేరారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) రద్దీ నెలకొంది. బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు గ్రామాలకు వెళ్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున వెళ్తుండటంతో.. చౌటుప్పల్ (Choutuppal) దగ్గర హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదు అయింది.
Panchayat Elections | అభ్యర్థుల పాట్లు
సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణాల్లో నివసిస్తున్న వారికి ఫోన్లు చేసి ఇళ్లకు రప్పిస్తున్నారు. కావాలంటే బస్సు ఛార్జీలు చెల్లిస్తామని చెబుతున్నారు. పట్టణాల్లో నివాసం ఉంటున్న వారిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు (Polling Centers) తరలి వస్తున్నారు.