Homeజిల్లాలుకామారెడ్డిWater Problem | తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కిన వైనం

Water Problem | తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కిన వైనం

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Water Problem | తలాపున నీళ్లున్నా గొంతులు తడారట్లేదు.. వర్షాకాలం వచ్చినప్పటికీ తాగునీటి గోస తప్పట్లేదు.. దీంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. చిన్నమల్లారెడ్డి (Chinnamalla Reddy) గ్రామ పంచాయతీ పరిధిలోని గురురాఘవేంద్ర కాలనీలో (Gururaghavendra Colony) ఈ పరిస్థితి నెలకొంది. దీంతో కాలనీవాసులంతా శుక్రవారం ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. నీళ్లు కావాలని నినదించారు.

Water Problem | వాటర్​ ట్యాంక్​లో నీళ్లున్నాయ్​..

విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే.. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో వాటర్​ ట్యాంక్​ ఉంది. దాంట్లో పుష్కలంగా నీళ్లున్నాయి. కానీ కాలనీవాసులకు నీళ్లు మాత్రం అందట్లేదు. దీంతో అపార్ట్​మెంట్లలో ఉన్న ప్రజలకు నీళ్లు రావట్లేదు. ఈ విషయమై రెండు నెలల నుంచి పంచాయతీ సిబ్బందికి తెలియజేసినప్పటికీ నామమాత్రంగానే స్పందిస్తున్నారే తప్ప నీటి సమస్యను పరిష్కరించట్లేదని వాపోయారు.

Water Problem | రోజువారి పనులకు ఇబ్బందే..

వాటర్ ట్యాంక్​లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ట్యాంక్ నుంచి ఇళ్లలోకి నీళ్లు సరఫరా చేసే వ్యవస్థలో ఇబ్బందుల కారణంగా కాలనీవాసులకు నీళ్లు అందట్లేదు. ఉద్యోగస్తులకు, రోజూ వారి పని చేసుకునే వారికి ఉదయం నీళ్ల కోసం ఎదురుచూసి అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. నీళ్లు లేక ఏ పని చేయడానికి కుదరట్లేదని వారంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతూ.. పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పంచాయతీ సెక్రెటరీని వివరణ కోరగా పైప్ లైన్ జామ్ కావడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. పైప్ లైన్ కోసం సిబ్బంది పనులు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజుల్లో నీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేస్తున్న కాలనీవాసులు