అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున రాబోయే రెండు మూడు రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
ప్రజల భద్రతా దృష్ట్యా 24 గంటలు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు వద్దకు వెళ్లవద్దన్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదని, ప్రమాదానికి గురయ్యే అవకాశముందని స్పష్టం చేశారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు (Farmers) తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్ తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇళ్లు పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్షం తాకిడికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని సీపీ హెచ్చరించారు. ఎక్కడైనా వరద ఉధృతి పెరిగిన సందర్భంలో పోలీసు సిబ్బంది (Police Satff), అధికారులు (Officers) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100కు లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712659700, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్నంబర్లను సంప్రదించాలని సీపీ సాయిచైతన్య సూచించారు.