అక్షరటుడే కోటగిరి : Heavy Rains | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) సూచించారు.
పోతంగల్ (Pothangal) మండలం సుంకిని వద్ద మంజీర పరీవాహక ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా మంజీర నదిలో ఉధృతి పెరిగే అవకాశం ఉందని.. తహశీల్దార్ గంగాధర్ సుంకిని గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు.
ఈ మేరకు గురువారం సబ్‌కలెక్టర్ ముంపు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండవద్దని ఆయన సూచించారు. భారీ వర్షాల కారణంగా.. వాగులు నదుల వైపు ఎవరూ వెళ్లకూడదన్నారు. వర్షాలు తగ్గేవరకు రైతులు పంట పొలాలకు వెళ్లకూడదని సూచించారు. చెరువులు కుంటలు నిండిపోయి, రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోందని ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని చెప్పారు.
Heavy Rains | సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
సుంకిని గ్రామానికి సమీపంలో నీరు రావడంతో మూడు కుటుంబాల ప్రజలు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కొల్లూరు దోమలెడ్గి, రామ్ గంగానగర్, హున్సా వాగులపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు జరగకుండా ట్రాక్టర్లను రోడ్డుకు ఇరువైపులా పెట్టారు.
బుధవారం సాయంత్రం పోతంగల్ మండలం కోడిచెర్ల మంజీర పరీవాహక ప్రాంతంలో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారనే సమాచారం ఎస్సై సునీల్ (SI Sunil), సీఐ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. ఎవరూ గల్లంతు కాలేదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.
సహాయక చర్యల్లో ఎంపీడీవో చందర్, స్పెషల్ ఆఫీసర్ నవదీష్ గౌడ్, ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, ఏఎంసీ ఛైర్మన్ హన్మంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, రాము, సిబ్బంది అధికారులు, తదితరులు ఉన్నారు.
హంగర్గలో పర్యటించిన సబ్ కలెక్టర్
అక్షరటుడే, బోధన్/ బాన్సువాడ: బోధన్ మండలం హంగర్గ గ్రామాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సందర్శించారు. నిజాంసాగర్ గేట్లు ఎత్తి వేయడంతో భారీగా వరద నీరు మంజీరాలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో హంగార్గ గ్రామానికి ప్రమాదం పొంచి ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అదేవిధంగా బోధన్ మండలంలో దెబ్బతిన్న పంటలను వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను ఆయన పరిశీలించారు. సబ్ కలెక్టర్ తో పాటు బోధన్ తహశీల్దార్ విఠల్ ఉన్నారు.
చందూర్ మండలంలో..
భారీ వర్షాలకు చందూర్ (Chandur) మండలంలోని ఎస్సీ కాలనీ ఇతర నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను గురువారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సందర్శించారు. ముందు జాగ్రత్తగా స్థానికులను సురక్షితంగా ఉండేందుకు చందూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించారు. పునరావాస కేంద్రంలో నీరు, ఆహార సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. బోధన్ అగ్నిమాపక శాఖ అధికారులు, రుద్రూర్ సీఐ కృష్ణా(CI Krishna) తో సమావేశమయ్యారు. మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు.
చందూర్‌లో వరద బాధితులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ వికాస్ మహతో