అక్షరటుడే, బోధన్: MandaKrishna Madiga | రాష్ట్రంలో వికలాంగులకు పింఛన్లు పెంచి ఇవ్వాలని లేదా సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
బోధన్ పట్టణంలో (Bodhan) నిర్వహించిన చేయూత పింఛన్ల (Pensions) పెంపు సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వ తుంగలో తొక్కిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా.. పింఛన్లను పెంచకపోవడం సిగ్గుచేటన్నారు.
MandaKrishna Madiga | ప్రతిపక్ష నాయకుడు ఫాంహౌస్‌కే పరిమితం..
పింఛన్లు పెంచే హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించాల్సిన కేసీఆర్ (KCR) ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు పట్టించుకోకపోవడంతో ఎమ్మార్పీఎస్ పింఛన్లు పెంచే ఉద్యమాన్ని భుజాన వేసుకుందని స్పష్టం చేశారు.
ఎమ్మార్పీఎస్ వికలాంగులు, వృద్ధుల పక్షాన ఉద్యమం చేపట్టినప్పుడల్లా పింఛన్లు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9వ తేదీన జరిగే పింఛన్ల పెంపు మహాసభకు పెద్ద ఎత్తున వికలాంగులు వృద్ధులు వితంతువులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సలీం, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
