అక్షరటుడే, వెబ్డెస్క్ : Manjira River | ఎగువ నుంచి వరదలు తగ్గడంతో మంజీర నది(Manjira River) శాంతించింది. గత కొద్ది రోజులుగా సింగూరుకు ఇన్ఫ్లో భారీగా రావడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయం(Edupayala Temple) వద్ద మంజీర ఉధృతంగా ప్రవహించింది.
సింగూరు ప్రాజెక్ట్(Singur Project)కు ఇన్ఫ్లో తగ్గడంతో ప్రస్తుతం ఒక గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం చెంత మంజీర శాంతించింది. మొన్నటి వరకు గర్భగుడిలో దుర్గమ్మ పాదాలను తాకూతు ప్రవహించిన వరద నీరు(Flood Water) ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఆలయం ముందు నుంచి స్పల్పంగా వరద పారుతోంది.
Manjira River | రాజగోపురంలో అమ్మవారికి పూజలు
మంజీరకు వరద తగ్గినా అధికారులు అమ్మవారి ఆలయాన్ని తెరవలేదు. గర్భ గుడి మూసి ఉంచారు. 11 రోజులుగా ఆలయం మూసి ఉంది. వరదతో ఆలయం లోపల బురద, గడ్డి, నాచు పేరకుపోయింది. క్యూలైన్ గ్రిల్స్(Qline Grills) వంగిపోయాయి. దీంతో అధికారులు వాటికి మరమ్మతులు చేస్తున్నారు. ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. అయితే గర్భగుడిని మాత్రం భక్తుల దర్శనం కోసం ఇంకా ఓపెన్ చేయలేదు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు కొనసాగుతున్నాయి. వరద పెరగకపోతే రెండు, మూడు రోజుల్లో ఆలయాన్ని తెరిచే అవకాశం ఉంది.
Manjira River | పోలీసుల చర్యలు
ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన భక్తుల్లో ఏటా మంజీరలో మునిగి పదుల సంఖ్యలో భక్తులు చనిపోతుంటారు. ప్రస్తుతం మంజీర ఉధృతంగా పారుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయం సమీపంలోకి ఎవరిని వెళ్లనీయకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఘనపురం ఆనకట్టపైకి ఎవరిని అనుమతించడం లేదు.