అక్షరటుడే, కామారెడ్డి: PD Act | నేరపూరిత చర్యలతో ప్రజలలో భయం, ఆందోళనలు కలిగిస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
PD Act | జాతీయ రహదారులపై..
జాతీయ రహదారులపై దారి దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులపై కామారెడ్డి పోలీసులు (Kamareddy police) పీడీ యాక్టు నమోదు చేశారు. సంబంధిత ఉత్తర్వుల కాపీని నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్న ముఠా సభ్యులకు గురువారం పోలీసులు అందజేశారు.
కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో జాతీయ రహదారులపై వాహనదారులను లక్ష్యంగా చేసుకుని గత కొద్దికాలంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఔరాద్ గ్రామానికి చెందిన కృష్ణబాబు షిండే, మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మంగ్యాల్కు చెందిన నాందేవ్, నాందేడ్ జిల్లా వసూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అజిత్ రమేశ్ ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైలులో (Nizamabad Central Jail) శిక్ష అనుభవిస్తున్నారు.
వీరిపై గతంలో మహారాష్ట్రలోని ఉద్గిరి రూరల్, నీలంగా పోలీస్ స్టేషన్లలో హత్య, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. వీరిపై కలెక్టర్ జారీచేసిన పీడీ యాక్టు ఉత్తర్వులను సదాశివనగర్ సీఐ సంతోష్ (CI Santosh), గాంధారి ఎస్సై ఆంజనేయులు నిందితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. సమాజంలో శాంతి, సామరస్యత నెలకొల్పేందుకు నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ యాక్టు నమోదుతో నిందితులు ఒక ఏడాది వరకు జైలులోనే ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఎవరైనా నేరపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.