అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అంతర్జిల్లా దొంగపై పీడీ యాక్టు (PD Act) నమోదు చేసినట్లు మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. లింగంపేట్ (Lingmpet) మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గారబోయిన శ్రీకాంత్ ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మేరకు పీడీ యాక్ట్ నమోదు చేసిన ప్రతిని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు అతడికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిందితుడు శ్రీకాంత్ అంతర్జిల్లా దోపిడీలు, దొంగతనాలతో పాటు లింగంపేట్ మండలంలో అమ్ముల లక్ష్మి అనే మహిళను ఆభరణాల కోసం హత్య చేసినట్లుగా గుర్తించబడ్డాడన్నారు.
అరెస్ట్ సమయంలో బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని, పీడీ యాక్ట్ ప్రకారం శ్రీకాంత్ ఒక ఏడాది పాటు బెయిల్ లేకుండా జైల్లో ఉంటాడని తెలిపారు. తరచూ నేరాలకు పాల్పడే వారు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా శాంతి, సామరస్యాన్ని నెలకొల్పుతామని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.