అక్షరటుడే, కామారెడ్డి: PD Act | అంతర్ రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకుండా కట్టడి చేస్తున్నారు. ఈ మేరకు నిందితులపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నారు.
PD Act | 8 మందిపై పీడీ యాక్టు
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే ఆరుగురిపై పీడీ యాక్టు (PD Act) నమోదు చేసిన పోలీసులు.. తాజాగా మరొక ఇద్దరు ముఠా సభ్యులపై పీడీ యాక్టు నమోదు చేసి ఉత్తర్వుల కాపీని నిజామాబాద్ జైలులో ఉన్న నిందితులకు అందజేశారు. కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) ఓ వైన్స్ షాప్‌లో రెండు నకిలీ రూ.500 నోట్లను వినియోగించిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
PD Act | ఇతర రాష్ట్రాల్లో నకిలీ నోట్ల ముఠా మూలాలు..
తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే మధ్యప్రదేశ్‌కు చెందిన లఖన్ కుమార్ దూబే, యూపీకి చెందిన సత్యదేవ్ యాదవ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్డే, దివాకర్ చౌదరి అలియాస్ బ్రిజేష్ కుమార్ గుప్తా, హరి నారాయణ భగత్ అలియాస్ సంజయ్, ఇబ్నుల్ రషీద్ అనే ఆరుగురు నిందితులపై పోలీసులు యాక్ట్ నమోదు చేసి ఉత్తర్వుల కాపీలను నిందితులకు అందజేశారు.
PD Act | తాజాగా మరో ఇద్దరికి ఉత్తర్వులు
ముఠాలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మనహరన్ లహరి, నంద్లాల్ జాంగ్డేలపై నమోదైన పీడీ యాక్టు ఉత్తర్వులను (PD Act orders) నిజామాబాద్ జైలులో నిందితులకు పట్టణ సీఐ నరహరి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. నకిలీ కరెన్సీ చలామణి ద్వారా ప్రజల్లో భయం, ఆర్థిక అస్థిరత సృష్టించే వారిని అరికట్టడంలో పీడీయాక్ట్ కీలకమైన చట్టమన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం నిందితులు ఒక ఏడాది వరకు బెయిల్ లేకుండా జైల్లోనే నిర్బంధంలో ఉండనున్నారని తెలిపారు. నకిలీ కరెన్సీ నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు జిల్లా పోలీసులు ఉక్కుపాదంతో వ్యవహరిస్తున్నారని, ఇటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై ఎటువంటి సడలింపు ఉండదని ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.