అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ind vs Pak | ఆసియా కప్ 2025 లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత చోటుచేసుకున్న “నో-హ్యాండ్ షేక్”(No-Handshake) వివాదం తీవ్ర రూపం దాల్చింది. మ్యాచ్ ముగిశాక భారత జట్టు ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో చేతులు కలపకుండా నేరుగా మైదానాన్ని విడిచిపెట్టిన వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్రంగా స్పందించింది.
ఈ వ్యవహారాన్ని కేవలం ఆటగాళ్ల మీదే కాకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పైకి కూడా నెట్టింది. ఆయన్ని ఆసియా కప్ 2025(Asia Cup 2025) మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుంచి తక్షణమే తొలగించాలంటూ పీసీబీ డిమాండ్ చేసింది. పీసీబీ చెబుతున్న దాని ప్రకారం, టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా(Pakistan Captain Salman Agha)కి షేక్ హ్యాండ్ చేయవద్దని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు సూచించాడట. ఈ విషయంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ మరియు స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు వ్యతిరేకమని ఆరోపించింది.
Ind vs Pak | ఇవేం ఆరోపణలు..
పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘‘మ్యాచ్ రిఫరీ ఇలా చేయడం తగదు. వెంటనే చర్య తీసుకోవాలి. ఆసియా కప్ వంటి గొప్ప టోర్నమెంట్‌లో ఇటువంటి ప్రవర్తనకు చోటుండకూడదు” అని అన్నారు. పీసీబీ జట్టు మేనేజర్ నవీద్ చీమా కూడా భారత జట్టుపై తీవ్రంగా స్పందించారు. మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ చేయకపోవడాన్ని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే, పీసీబీ తమ జట్టు కెప్టెన్‌ను మ్యాచ్ అనంతర కార్యక్రమాలకు పంపించకుండా నిరసన తెలిపింది. ఈ వివాదంపై ఐసీసీ(ICC) ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. పీసీబీ స్ట్రాంగ్ ఆరోపణలు చేయడం, మ్యాచ్ రిఫరీ తొలగింపును డిమాండ్ చేయడం ఆసియా కప్‌లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు భారీ నిరాశకు గురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 127/9 పరుగులకే పరిమితమైంది. భారత జట్టు 128 పరుగుల లక్ష్యాన్ని 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Ydav) అజేయంగా 47(37) పరుగులు చేశాడు. సిక్స్‌తో మ్యాచ్ ముగించడం హైలైట్‌గా మారింది. ఇక పాకిస్తాన్ ఇప్పుడు సూపర్ 4 చేరుకునేందుకు శ్రమిస్తుంది. చిన్న టీమ్స్ మీద ఓడిపోయిందంటే ఇక పాక్ క్రికెట్ అభిమానులు ఆటగాళ్లని ఓ రేంజ్‌లో తిట్టిపోయడం ఖాయం.