అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan | ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా (Jagtial District) మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని (Kondagattu Anjaneya Swamy Temple) దర్శించుకున్నారు. శనివారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
పవన్ కల్యాణ్ ఏపీ నుంచి కొండగట్టు చేరుకున్నారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల నుంచి పవన్ గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ పూజారులు, అధికారులు స్వాగతం పలికారు. పవన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ నిధులు (TTD Funds) రూ.35.19 కోట్లతో కొండగట్టులో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ మండలంలో ఒకేసారి రెండు వేల మంది దీక్ష విరమించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
Pawan Kalyan | కొండగట్టు పునర్జన్మ ఇచ్చింది
కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిందని పవన్ అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలంటే దేవుడి దయ ఉండాలన్నారు. గతంలో విద్యుత్ ప్రమాదం (Electrical Accident) నుంచి తనను కొండగట్టు అంజన్న కాపాడారన్నారు. క్షేత్రంలో సత్రం, దీక్ష విరమణ మండపం కావాలని తనను కోరారన్నారు. టీటీడీ, తెలంగాణ నాయకుల కృషితో నేడు శంకుస్థాపన చేశామన్నారు.
భగవంతుడి ఆశీస్సులు ఒక్క పార్టీకి ఉండవు అన్నారు. అందరికి ఉంటాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి ధన్యవాదాలు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.