అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan | జనసేన పార్టీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు రామ్ తాళ్లూరికి ప్రధాన బాధ్యతలు అప్పగిస్తూ, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి రామ్ తాళ్లూరి, జనసేన పార్టీ(Jana Sena Party) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నాగబాబు బాధ్యతలను రామ్ తాళ్లూరి తీసుకోనున్నారు. ఇప్పటికే పార్టీ ఐటీ విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న రామ్ తాళ్లూరికి, పార్టీ సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాల బాధ్యతలు కూడ అప్పగించడం ద్వారా, జనసేన కార్యకలాపాలను మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
Pawan Kalyan | నాగబాబు వెనకడుగు
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబు పార్టీ వ్యవహారాలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకుందని జనసేన వర్గాలు వెల్లడించాయి. పార్టీ పాలనలో అనుభవం, ఐటీ రంగంలో నైపుణ్యం కలిగిన రామ్ తాళ్లూరి(Ram Talluri)ని ఈ పదవికి తీసుకోవడం ద్వారా, జనసేనను మరింత విస్తృతంగా అభివృద్ధి చేయాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా భావిస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచే రామ్ తాళ్లూరి పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో కలిసి పనిచేస్తున్నారు. పార్టీ స్థాపన, కార్యకలాపాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. తన నియామకంపై స్పందించిన రామ్ తాళ్లూరి, “పవన్‌ను మొదటిసారి కలిసిన నాటి ఉత్సాహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ప్రజల కోసం సేవ చేయడానికి ఈ బాధ్యతను గౌరవంగా భావిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాళ్లూరి, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారై. లీడ్ ఐటీ కార్ప్, ఫ్లై జోన్ ట్రాంపోలిన్ పార్క్, రామ్ ఇన్నోవేషన్స్ వంటి వ్యాపార సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారు. అలాగే సినీ నిర్మాణంలో కూడా రామ్ తనదైన ముద్ర వేశారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పలు సినిమాలను నిర్మించారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన రామ్ తాళ్లూరికి ఈ కీలక పదవి లభించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త నియామకంతో జనసేన పార్టీ తెలంగాణలో తన పునాదులను బలంగా వేసేందుకు సన్నద్ధమవుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ వ్యవస్థాపకంగా మార్పులు చేపడుతోంది.