అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan convoy accident | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan) కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో మిగతా వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రస్తుతం విశాఖపట్నం (Visakhapatnam)లో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అయితే ఆ సమయంలో పవన్ కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పవన్ కల్యాణ్‌ను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్‌లోని వాహనాలు సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తుండగా.. ఒక వాహనం డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలు కార్లు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. అయితే ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని కాన్వాయ్‌లో నుంచి తొలగించారు. దాని స్థానంలో మరో కారును ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) విశాఖలో పర్యటిస్తున్నారు. ఆమె ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ సైతం విశాఖకు వచ్చారు. ఈ క్రమంలో కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆయన పర్యటన యథావిధిగా కొనసాగనుంది.