అక్షరటుడే, వెబ్డెస్క్ : Uppada | కాకినాడ జిల్లా (Kakinada district) ఉప్పాడలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న మత్స్యకారుల ఆందోళనకు ఎట్టకేలకు తెర పడింది. సముద్రంలో ఫార్మా పరిశ్రమల వ్యర్థాల వల్ల జీవవైవిధ్యం నాశనం అవుతుందంటూ ఆందోళనకు దిగిన మత్స్యకారులకు (fishermen), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు.
ఉప్పాడ తీరంలో ఫార్మా పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు (Chemical waste) సముద్రంలో కలుస్తున్నాయి. దీని ప్రభావంతో మత్స్య సంపద దెబ్బతింటోందని, తాము జీవించగలిగే పరిస్థితి లేకుండా పోతోందని మత్స్యకారులు వాపోయారు. “కేటాయించిన ఫిషింగ్ జోన్లు ఖాళీగా మారుతున్నాయి.. ఇది వృత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది” అని సంఘాల నాయకులు పేర్కొన్నారు.
Uppada | పవన్ కళ్యాణ్ స్పందన
ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే తాను స్వయంగా ఉప్పాడకు వచ్చి మత్స్యకారులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ హామీని జిల్లా కలెక్టర్ మత్స్యకారులకు తెలియజేయగా, సంఘాల నాయకులు ఆ విషయాన్ని చర్చించుకుని ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అక్టోబర్ 10వ తేదీ లోగా తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, మళ్లీ ఉప్పాడ తీరాన్ని ఉద్యమ వేదికగా మార్చుతామని హెచ్చరించారు.
మత్స్యకారుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే.. సముద్రంలో కాలుష్యాన్ని కలిగిస్తున్న ఫార్మా పరిశ్రమలను (pharmaceutical industries) తక్షణమే మూసివేయడం, సముద్రంలో విషపూరిత వ్యర్థాల విడుదలను నిలిపివేయడం, మత్స్యకారుల జీవనాధారాన్ని రక్షించే చర్యలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేయడం.. ఈ పరిణామాలపై సమాజంలోని పర్యావరణవాదులు, మత్స్య సంఘాలు, స్థానికులు ప్రభుత్వ స్పందనపై ఆశగా ఉన్నారు. పవన్ కల్యాణ్ హామీ ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో అక్టోబర్ 10వ తేదీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.