అక్షరటుడే, వెబ్డెస్క్ : Ambati Rambabu | కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం జోగి రమేష్ (Jogi Ramesh)ని అరెస్ట్ చేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు అరెస్టు చేస్తారన్న ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో పోలీసులకు ఆటంకం కలిగించడంతో పాటు, వారిని బెదిరించారనే ఆరోపణలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ (Pattabhipuram Police Station)లో కేసు నమోదు అయినట్లు సమాచారం.
Ambati Rambabu | అంబటిపై కేసు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంబటి రాంబాబు (Ambati Rambabu) అనుమతులు పొందకుండానే నిరసన కార్యక్రమం చేపట్టారని, దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలకు అసౌకర్యం కలిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు పలువురిపై బీఎన్ఎస్ సెక్షన్లు 132, 126(2), 351(3), 189(2), రీడ్ విత్ 190 కింద కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మెడికల్ కళాశాలల (YCP Medical Colleges) ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టాభిపురం వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ అరవింద్ (DSP Arvind), సీఐ గంగా వెంకటేశ్వర్లు (CI Ganga Venkateswarlu) తెలిపినా, అంబటి అనుచరులు వినిపించుకోలేదని తెలుస్తోంది. బారికేడ్లను నెట్టుకుని వంతెనపైకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ క్రమంలో అంబటి రాంబాబు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుత నిరసనకు పోలీసులు కావాలనే ఆటంకం కలిగిస్తున్నారని అంబటి ఆరోపించగా, మరోవైపు పోలీసులు వారి చర్యలతో విధుల్లో ఆటంకం కలిగిందని పేర్కొన్నారు. చివరికి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
