అక్షరటుడే, కామారెడ్డి: Ayushman Health Center | ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం వద్ద రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పోలీసులను ఆదేశించారు. గర్గుల్ (gargul) శివారులోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలో ఆకతాయిలు రాత్రివేళల్లో తిష్ట వేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చినందున.. పెట్రోలింగ్ చేయాలని పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్య కేంద్రంలోని మౌలిక వసతులను, రోగులకు అందుతున్న సేవలను గురించి ఆరా తీశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి వెంటనే పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నీటి వసతికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని గ్రామ కార్యదర్శిని ఎంపీడీవోలను ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సంబంధించిన ఔట్‌పేషెంట్ వివరాలు, రోజువారీగా నివేదికలు రిజిస్టర్లో అబ్స్ట్రాక్ట్ రూపంలో రాసి పెట్టాలని సూచించారు. కావాల్సిన ఇతర మౌలిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని (DMHO) ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభుకిరణ్, మండల వైద్యాధికారి జోహార్, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.