అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy GGH | కామారెడ్డి జీజీహెచ్(Kamareddy GGH)లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఆస్పత్రిలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని వైద్యాధికారులు చెప్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి.
సోమవారం జీజీహెచ్‌లో వృద్ధులు, రోగులు ఆస్పత్రి సిబ్బంది(Hospital Staff) లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదటి, రెండో అంతస్తులకు రోగులను వీల్‌చైర్‌లో తీసుకెళ్లేందుకు సిబ్బంది లేకపోవడంతో రోగుల బంధువులే ఆస్పత్రి సిబ్బంది అవతారమెత్తారు. కుటుంబ సభ్యులే పై అంతస్తులకు వీల్‌చైర్(Wheelchair)లో రోగులను తీసుకు వెళ్లారు.
ఓ వృద్ధురాలిని తన మనవరాలు ఎమర్జెన్సీ వార్డు(Emergency Ward) నుంచి రెండో అంతస్తుకు వీల్‌చైర్‌లో తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడింది. తీరా రెండో ఫ్లోర్ వద్దకు తీసుకెళ్లాక అక్కడున్న సిబ్బంది వీల్‌చైర్ వార్డులోకి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు ఆస్పత్రిలో నిత్యం కనిపిస్తాయని రోగులు, బంధువులు చెబుతున్నారు. ‘మా వాళ్లను మేమే వీల్‌చైర్‌లో తీసుకెళ్లాక ఇక్కడ సిబ్బంది అవసరం ఏముంటుందని, వాళ్లకు జీతాలు ఇవ్వడం ఎందుకు’ అని బంధువులు ప్రశ్నిస్తున్నారు.