అక్షరటుడే, వెబ్‌డెస్క్: Former MLA Anjali | విమానంలో ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే ఫ్లైట్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వెంటనే సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ అంజలి నింబాల్కర్ (Dr. Anjali Nimbalkar) ఏఐసీసీ గోవా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె శనివారం గోవా నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో (IndiGo flight) వెళ్తున్నారు. అదే విమానంలో ఉన్న అమెరికన్ మహిళ అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే జరిగింది. కాలిఫోర్నియాకు (California) చెందిన జెన్నీ అనే ప్రయాణికురాలు తన సీటులో ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఆమెకు తీవ్రమైన వణుకు రావడం ప్రారంభమైంది. దీంతో తోటి ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి.
Former MLA Anjali | వైద్య సాయం చేసి..
అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ అంజలి, వైద్య సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. వెంటనే సీపీఆర్, ఇతర అత్యవసర చర్యలు చేపట్టి ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడారు. విమానం ఢిల్లీ చేరుకునే వరకు డాక్టర్ అంజలి ఆమె పక్కనే ఉండి, అత్యవసర సంరక్షణను కొనసాగిస్తూ ఆమె పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించారు. ముందుగానే ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో విమానం ల్యాండ్ అయ్యే వరకు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. ల్యాండ్ కాగానే ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించారు.
కాగా అంజలి ఒక డాక్టర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు. ఆమె 2018– 2023 మధ్య బెళగావి జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె ఎంబీబీఎస్ డిగ్రీ, గైనకాలజీలో ఎంఎస్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.