అక్షరటుడే, కామారెడ్డి : MLA PA | ఉమ్మడి జిల్లాలో ప్రజలు పలువురు ఎమ్మెల్యేలను నేరుగా కలవలేని పరిస్థితి నెలకొంది. కింది స్థాయి నాయకులకు సైతం ఎమ్మెల్యే అపాయింట్మెంట్ (MLA appointments) దొరకడం లేదు. వారి పీఏలే అన్ని పనులు చక్కబెడుతున్నారు.
కొంత మంది పీఏలు అయితే వారే ఎమ్మెల్యేలం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పీఏల (PAs) వ్యవహారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కొంతమంది వ్యక్తిగత సహాయకులు అయితే అధికారులకు ఫోన్లు చేసి సైతం పనులు చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం. ప్రజలు తమకు ఏదైనా సాయం కావాలి వస్తే ఎమ్మెల్యేల వద్దకు వస్తుంటారు. ఈ క్రమంలో ఏ పనైనా తామే చేస్తామంటూ పీఏలు తేల్చి చెబుతున్నారు.
నేరుగా ఎమ్మెల్యే చెప్పారని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫలానా పని చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. కొందరు ముఖ్య నాయకులు (important leaders) ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రయత్నించినా కలవనివ్వకుండా పీఏలు అడ్డుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. కార్యకర్తలు, నాయకులకు ఇదే విధంగా పీఏల నుంచి సమస్యలు ఎదురు అవుతున్నట్లు చర్చించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నాయకుడి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ తమకే అపాయింట్మెంట్ దొరకడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తమ సమస్యలు, సంతోషాలు (problems and happiness) ఎమ్మెల్యేలకు చెప్పుకునేదెలా అని పలువురు నాయకులు వాపోతున్నారు.
MLA PA | తెలిసే జరుగుతుందా?
ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేల పీఏల (MLAs’ PAs) తీరు నాయకుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఫలితంగా ఎమ్మెల్యేలు అబాసుపాలవుతున్నారన్న ప్రచారం ఓ వైపు సాగుతోంది. మరోవైపు వాళ్లకు తెలియకుండానే పీఏలు ఇంత దర్జాగా పెత్తనం చేలాయిస్తారా అనే వాదన కూడా వినిపిస్తోంది. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని నియోజకవర్గ స్థాయి నేతల (constituency level leaders) వరకు ఎమ్మెల్యేల పీఏల తీరుపై గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పీఏల విషయం తెలిసినా పట్టించుకోవడం లేదా.. లేక నిజంగానే ఎమ్మెల్యేలకు తెలియకుండానే వారు సొంత ఏజెండాతో ముందుకు సాగుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
MLA PA | స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవా?
రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీసీ రిజర్వేషన్ (BC reservation) అంశం కొలిక్కి వస్తే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితా కూడా విడుదల చేసింది. అయితే ఎమ్మెల్యేల పీఏల తీరుతో స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొంటున్నారు. కిందిస్థాయి నాయకులు కూడా పీఏల తీరుపై ఆగ్రహంగా ఉండటంతో వారు ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. మరోవైపు ప్రజలు సైతం నాయకులను నిలదీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పీఏల వ్యవహారంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని ఆయా పార్టీల కార్యకర్తలు కోరుతున్నారు.