అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ వీడటం లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడంతో ఎన్నికలపై ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు.
తాము అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ (Congress) ప్రకటించింది. ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత కుల గణన (Caste Census) చేపట్టింది. బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే వాటిపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేయాలని భావించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపగా.. ఆయన కూడా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉండడంతో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
Local Body Elections | పార్టీపరంగా రిజర్వేషన్లు
స్థానిక ఎనికల్లో రిజర్వేషన్ బిల్లు, ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించే స్థానాల్లో 42శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. తాము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే ఇతర పార్టీలు సైతం అదేదారిలో వస్తాయని హస్తం పార్టీ భావిస్తోంది.
Local Body Elections | పీఏసీ సమావేశంలో చర్చ
గాంధీభవన్‌లో శనివారం(నేడు) సాయంత్రం పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, కమిటీ సభ్యులు పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే నామినేటేడ్ పోస్టులపై సైతం చర్చించనున్నారు. ఈ నెల 25న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. దీంతో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై నేడు చర్చించి మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.