అక్షరటుడే, వెబ్డెస్క్ : Parliament Sessions | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Minister Kiren Rijiju) తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.
పార్లమెంట్ సమావేశాలను (Parliament Sessions) డిసెంబర్ 1 నుంచి 19 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, ప్రజల ఆకాంక్షలను తీర్చే ఉత్పాదక, అర్థవంతమైన సమావేశం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. శీతాకాల సమావేశాలు సైతం వాడివేడిగా సాగే అవకాశం ఉంది. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొంతకాలంగా వోటు చోరీ పేరిట ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు సభలో చర్చకు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే వివిధ సమస్యలపై ఆయా పార్టీలు తమ గళం వినిపించనున్నాయి. ప్రభుత్వం సైతం పలు బిల్లులను సభ ముందు ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.