అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | హైదరాబాద్ నగరంలోని చాలా పార్కులను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. చెరువులు, నాలాలతో (ponds and canals) పాటు పార్కులను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. పలువురు పార్కులను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పార్కులను కాపాడాలని పలువురు హైడ్రాను కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో (Prajavani) ఫిర్యాదులు చేశారు.
హైడ్రా కార్యాలయంలో (Hydra office) ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేడు నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులు వచ్చాయి. అమీన్‌పూర్ పెద్దచెరువు (Aminpur Peddacheruvu), రావిర్యాల చెరువుల విస్తీర్ణం ఏటా పెరుగుతూ.. ఎగువ భాగంలో ఉన్న నివాసాలను ముంచెత్తుతున్నాయని ఆయా ప్రాంతాల వారు ఫిర్యాదు చేశారు. హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ అర్జీలను స్వీకరించారు.
Hydraa | ప్రభుత్వ భూమి కబ్జా
మేడ్చల్ జిల్లా (Medchal district) అల్వాల్ మండలం మచ్చబొల్లారం గ్రామంలో 30 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్నట్లు బాలాజీ ఎన్‌క్లేవ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 60 కాలనీలలో 60 వేలకు పైగా ఇళ్లున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school) నిర్మించేందుకు ఈ భూమిని కేటాయించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం పెరుగుతుండటంతో తమ కాలనీలు నీట మునుగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో తూముల ద్వారా కిందకు నీరు వెళ్లేదని.. ఇప్పుడు వాటిని పూర్తిగా బంద్ చేయడంతో మురుగు, వర్షం నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామన్నారు.
Hydraa | ఖాళీ స్థలాలు మాయం
మహేశ్వరం మండలం (Maheshwaram mandal) రావిర్యాల గ్రామంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఖాళీ స్థలాలు మాయం అవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. పార్కులు ఆక్రమించి ప్రార్థన మందిరాలు నిర్మిస్తున్నారని, షెడ్లు వేసి అద్దెలకు ఇస్తున్నారని పేర్కొన్నారు. రోడ్లు బ్లాక్ చేసి ఇష్టానుసారం ఖాళీ స్థలాలు కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాగ్‌లింగంపల్లి డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో 1300 గజాల పార్క్ స్థలంలో పలు దుకాణాలు ఏర్పాటు చేశారని కాలనీవాసులు పేర్కొన్నారు.
