అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములతో పాటు ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది.
నగరంలో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా చర్యలు చేపడుతోంది. తాజాగా పార్క్ స్థలాన్ని కబ్జా చెర నుంచి విడిపించింది. ఎల్బీనగర్ జోన్ పోచారం సర్కిల్ (Pocharam Circle) పరిధిలోని కొర్రెములలో సర్వే నెంబర్ 747, 750లో ఉన్న 1034 గజాల పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. అక్కడ ప్రహరీ నిర్మించారు. దీనిపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు (Hydraa Officers) అది పార్కు స్థలమని నిర్ధారించారు. సోమవారం ప్రహరీని కూల్చివేశారు.
Hydraa | ఫిర్యాదులపై చర్యలు
హైడ్రా అధికారులు ప్రతి సోమవారం ప్రజావాణి (Prajavani) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. పార్కులు, రోడ్లు, నాలాల ఆక్రమణలపై అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయా ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. విచారణ చేపట్టి ఆక్రమణలు నిజమని తేలితే కూల్చివేతలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇటీవల నగరంలో ఓ నాలాను ఆక్రమించి ప్రైవేట్ స్కూల్ వారు నిర్మాణం చేపట్టగా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అనేక పార్కులను కాపాడింది. మియాపూర్లోని మదీనాగూడ వద్ద గంగారాం డ్రెయిన్ లైన్ నుంచి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ (Sri Chaitanya Techno School) ఆక్రమణలను ఆదివారం హైడ్రా తొలగించింది. డ్రెయిన్ మూసుకుపోయి మూడు మీటర్లకు తగ్గించబడిందని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.