అక్షరటుడే, వెబ్డెస్క్: Ongole | సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న కారణాలతో చాలా మంది హత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమ, వివాహేతర సంబంధం, ఆస్తి తగదాలతోనే చాలా వరకు నేరాలు జరుగుతున్నాయి. కొందరు వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న వారిని కడతేరుస్తుంటే.. మరికొందరు కన్న పిల్లలను, తల్లిదండ్రులను సైతం హత్య చేస్తున్నారు. ప్రేమ పేరిట పిల్లలను తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలను చంపడానికి వెనకడటం లేదు. తాజాగా ఓ యువతి పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని తల్లిదండ్రులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు.
ఏపీలోని ఒంగోలు(Ongole) నగరంలోని ముంగమూరు రోడ్డు(Mungamuru Road)లోని నివసించే పల్నాటి రమేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురికి గతంలోనే వివాహం అయింది. రెండో కుమార్తె తనూష (23) డిగ్రీ చదివి హైదరాబాద్(Hyderabad)లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసింది. కొంతకాలంగా ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే తనూష ఇప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న వ్యక్తిని ప్రేమించింది. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అయినా తనూష తీరు మారకపోవడంతో క్షణికావేశంలో గొంతు నులిమారు. దీంతో ఆమె ఊపిరాడక చనిపోయింది.
Ongole | ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
కూతురు చనిపోవడంతో ఆ దంపతులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఆమె ఉరి వేసుకొని చనిపోయినట్లు కుమార్తె మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీశారు. రాత్రి ఇంట్లో ఉరి వేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి తీరుపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు.