అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Junior College | ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల వసతులు కల్పిస్తోందని భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జయపాల్రెడ్డి అన్నారు. సర్కారు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’లో ఆయన మాట్లాడారు.
Bheemgal Junior College | ఆధునిక వసతులతో విద్య
ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు ప్రభుత్వం డిజిటల్ బోర్డులను అందుబాటులోకి తెచ్చిందని ప్రిన్సిపాల్ వివరించారు. ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక పరికరాలు, వసతులతో కూడిన విద్యను ప్రభుత్వ కళాశాలలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా కళాశాలకు పంపించి, ఈ సదుపాయాలను వినియోగించుకునేలా చూడాలని కోరారు.
పరీక్షలకు సిద్ధం కావాలి
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు. అప్పుడే వారి భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ, కళాశాలలో అందుతున్న విద్యాబోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.